నిర్భయ కేసులో తమకు ఉరి తప్పదని తేలిన తర్వాత దోషులు నలుగురు ఎక్కడ ఎలాంటి అవకాశం దొరికినా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారి ఉరిశిక్ష రెండు సార్లు వాయిదాపడగా, ట్రయల్ కోర్టు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 3న నలుగురినీ ఒకేసారి ఉరితీయాలని పేర్కొంది. అయితే తాజాగా తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న నిర్భయ దోషి వినయ్ శర్మ, ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.
తనను ఉంచిన సెల్ లో గోడకు తలను బాదుకున్నాడని, ఈ ఘటనలో వినయ్ కి స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో ఎలాంటి జాప్యం చోటు చేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి అభిలషించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకూ తన ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని దోషి పవన్ గుప్తా, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీంతో 3వ తేదీన వారి ఉరి అనుమానంగానే ఉంది.