కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మరియు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో 370 కిలోమీటర్ల విస్తీర్ణంతో రూ.3, 717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయటంతో పాటు 396 కిలోమీటర్ల పొడవున రూ.9, 440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేశారు. నరేంద్రమోదీ నవ భారత నిర్మాణంలో భాగంగా, దేశంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నామని దీనిని సాకారం చేసుకోవడం కోసం ఈ 14 ప్రాజెక్టులు మరో ముందడుగా చెప్పవచ్చని గడ్కరీ పేర్కొన్నారు.
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2511 కి.మీ కాగా ఇప్పుడు 3,910 కి.మీ.కు పెరిగింది. 1,399 కి.మీ మేర (55.71%) నమోదైన ఈ పెరుగుదల కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. భూమి పూజ జరిగిన ఎనిమిది ప్రాజెక్టులు, రూ. 9,440 కోట్ల వ్యయం, 396 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి. వీటి ద్వారా రహదారి మౌలిక సదుపాయాలకు పెద్దయెత్తున లాభం కలుగనుంది.