ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు దీరింది.ఈ నేపథ్యంలో పాలనపై రాష్ట్ర బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో పాలనలో బీజేపీ పాత్ర ఏంటనే అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… రాష్ట్రంలో కొత్తశకం ప్రారంభమైందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సాధించిన విజయం చాలా పెద్దదని, పాలన గాడి తప్పితే ప్రజలు ఎలా గుణపారం చెబుతారో చూపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమికి 164 సీట్లు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరని, నిశ్శబ్ద విప్లవంగా ప్రజలు ఓట్లు వేశారని పురంధేశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేనతో బీజేపీ కలిసి పాలన అందించాలన్నారు. సమస్యలను ఉమ్మడిగా పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని పురంధేశ్వరి బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు గెలుపొందిన విషయం తెలిసిందే.