ఆయనో ఐఏఎస్..ఇప్పుడు పోస్టింగ్ లేకుండా రోజూ వచ్చిపోతున్నారు.అసలే రాష్ట్రంలో ఐఏఎస్ ల కొరత బాగా ఉంది. దీనికి తోడు సీనియర్ ఐఏఎస్ లు కొందరు కేంద్ర క్యాడర్ లోకి వెళ్లారు. ఇలాంటి సమయంలో ఉన్న ఐఏఎస్ ల సేవలు సక్రమంగా వినియోగించుకోవాలస్సిన పరిస్థితి ఉంది. కానీ, బదిలీల పేరుతో శాఖలను మార్చిన ప్రభుత్వం నెల గడుస్తున్నా ఓ ఐఏఎస్ కి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. దీనికి ఓ భూ వివాదమే కారణమని..ఆ వివాదమే అయన కెరీర్ ని బలితీసుకుందా అన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తుంది.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన వాసం వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఆ పదవి నుంచి చాకచక్యంగా తప్పించిదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఒక భూ వివాదంలో కోటి పన్నెండు లక్షల లంచం తీసుకున్న కీసర తహశీల్దార్ నాగరాజు కేసులో కలెక్టర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన ఎసిబి… కొందర్ని జైలుకు కూడా పంపించింది. ఈనేపథ్యంలో ఏసీబీ విచారణలో నాగరాజు సంచలన విషయాలు చెప్పారని కలెక్టర్, ఆర్డీవో, మరికొందరు ఎమ్మార్వోల ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నానని చెప్పినట్లు సమాచారం.
దీంతో కలెక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించారు. కానీ రెండు నెలల వరకు ఆ కేసులో తహసీల్దార్ నాగరాజు తప్ప ఇతర అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ గత ఏడాది చివర్లో సుమారు 25 మంది ఐఏఎస్ లను బదిలీలు చేసిన ప్రభుత్వం వాసం వెంకటేశ్వర్లు మినహా అందరికి పోస్టింగ్ ఇచ్చింది. కొంతమంది జూనియర్ ఐఏఎస్ లను సైతం కలెక్టర్ లు గా నియమించింది.
ప్రస్తుతం ఐఏఎస్ వాసం వెంకటేశ్వర్లు పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని విధంగా తయారైంది. ప్రతిరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి రిపోర్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో సాధారణ ఉద్యోగిలా వ్యహరించాల్సిన పరిస్థితి. నిత్యం సెక్రటేరియట్ కు వచ్చి వెళ్తున్నారు. అయితే పోస్టింగ్ ఇవ్వకపోవడానికి కారణం చెప్పకపోయినా… కీసర భూ వివాదమే అనే టాక్ నడుస్తోంది.