ప్రజాపాలన కాదు.. మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. “మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే.. మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది.
ముఖ్యమంత్రి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు.