దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాదారులకు పోస్టల్ విభాగం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వం అందించే సబ్సిడీని వారు నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోనే పొందవచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) కింద అందే ఎల్‌పీజీ సబ్సిడీతోపాటు పెన్షన్ మొత్తాన్ని కూడా నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకే బదిలీ అయ్యేలా సౌకర్యం కల్పించారు. దీంతో ఆయా మొత్తాలను పోస్టాఫీస్ ఖాతాదారులు ఇకపై తమ పోస్టల్ అకౌంట్లలోనే పొందవచ్చు.
ఇక ఈ సదుపాయాన్ని పొందాలంటే ఆధార్ కార్డును పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు లింక్ చేసి ఉండాలి. అదే కొత్త కస్టమర్లు అయితే అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఆధార్ సీడింగ్ కోసం ప్రత్యేక పత్రాన్ని అందజేయాలి. దీంతో గ్యాస్ సబ్సిడీ, పెన్షన్ తదితర మొత్తాలు పోస్టల్ అకౌంట్లలోనే పడతాయి.
ఇప్పటి వరకు ఈ సదుపాయాన్ని అనేక బ్యాంకుల్లోనే అందిస్తున్నారు. కానీ ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోనూ పొందవచ్చు. ఈ క్రమంలో ఆయా మొత్తాలు పోస్టాఫీస్ అకౌంట్లకు బదిలీ అయితే వాటి నుంచి నగదును నేరుగా తీసుకోవచ్చు. పోస్టాఫీస్ లో సేవింగ్స్ అకౌంట్స్ కలిగి ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.