లావుగా ఉన్నారా.. అయితే మీకీ తిప్పలు తప్పవు.. జాగ్రత్త మరి

-

ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. ఈ ఊబకాయం కారణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తాజాగా జరిగిన పరిశోధనల్లో ఊబ కాయస్తులను మరింత బాధించే వాస్తవం వెలుగు చూసింది. అదేంటంటే.. ఊబకాయానికీ ఆస్తమాకీ సంబంధం ఉందట. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ కి చెందిన
పరిశోధకులు చెబుతున్నారు.

ఇందుకోసం వీళ్లు కొందరు ఊబకాయుల్ని పరిశీలించి పరిశోధనలు చేశారట. వాళ్లలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు గుర్తించారట. వాళ్ల ఊపిరితిత్తుల గోడల్లో కొవ్వు కణజాలం పేరుకోవడంతో గాలి మార్గాలు మూసుకుపోతున్నాయట. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోందట.

ఈ పరిశోధనల వల్ల ఊబకాయంతో ఆస్తమా, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఆయా వ్యక్తులు బరువు తగ్గినప్పుడు ఆటోమేటిగ్గా వాళ్ల ఊపిరితిత్తుల్లోనూ ఈ కొవ్వు కణజాలం తగ్గిపోతోందట. దీంతో శ్వాస సమస్యలూ తగ్గిపోతున్నాయట. ఈ కారణం వల్లే భారీకాయులు బలంగా శ్వాస తీసుకుంటుంటారని కూడా చెబుతున్నారు.

కాబట్టి ఆస్తమాతో బాధపడే ఊబకాయులు తమ బరువు సమస్య తగ్గించుకుంటే.. ఆస్తమా సమస్య నుంచి కూడా బయటపడతారన్నమాట. అందుకే ఊబకాయం ఉన్నవారు ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉన్నపళంగా కాకుండా క్రమంగా బరువు తగ్గేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version