ఆమె కురువృద్ధురాలు. శారీరకంగా బలహీనురాలైన ఆమె చర్మం ముడుతలు పడి, చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేదు. కానీ మానసికంగా మాత్రం ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మరోసారి తనకు ఎన్నికల్లో ఓటేసే అవకాశం వచ్చిందని సంబురపడుతున్నది. అంతేకాదు ‘ఈ ఎన్నికల్లో ఓటేసే వాళ్లలో నేనే అందరికంటే పెద్దదాన్నట’ అని గర్వంగా చెబుతున్నది. ఆమె చెప్పేది నిజమే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయనున్న కోటీ 47 లక్షల 86 వేల మందికి పైగా ఓటర్లలో.. కలితారా మండల్ అనే ఈ 110 సంవత్సరాల బామ్మే అందరికంటే సీనియర్.
ఈ సీనియర్ బామ్మ తన తోటి ఓటర్లకు ఓటుహక్కు వినియోగించుకోవాలని మంచి సందేశం కూడా ఇచ్చారు. ‘ఓటు చాలా ముఖ్యమైనది. ఇది రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. నాకు ఓటు హక్కు వచ్చిప్పటి నుంచి తప్పకుండా ఓటేస్తున్నా. ఇది నాకు శక్తినిస్తుంది. అందరికంటే పెద్దదానిగా ఢిల్లీలోని ప్రతి ఓటరును నేను కోరేదొక్కటే.. నేను ఓటు వేస్తున్నా మీరు కూడా వేయండి’ అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 1.47 కోట్లకు పైగా ఓటర్లు 650 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. మహిళలు, పురుషులేగాక ఢిల్లీలో 869 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు.