ప్రపంచాన్ని ప్రస్తుతం ఓమిక్రాన్ కరోనా వేరియంట్ కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో మొదటగా బయటపడిన ఓమిక్రాన్ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 50కి పైగా దేశాలకు పాకింది. తక్కువ కాలంలోనే అధిక వ్యాప్తి ఉండటం ఈ వేరియంట్ లక్షణాల్లో ఒకటి. ఇందుకనే అన్ని దేశాలు భయపడుతున్నాయి. ఇండియాలో కూడా ప్రస్తుతం మొత్తం 23 ఓమిక్రాన్ కేసులు భయటపడ్డాయి. ముఖ్యంగా బ్రిటన్, దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య అధికంగా ఉంది.
ఇదిలా ఉంటే ఓమిక్రాన్ లో కొత్త వెర్షన్ వైరస్ ను ఆస్ట్రేలియా వైద్యులు గుర్తించారు. ఇప్పుడు ఈ వార్త ప్రపంచానికి గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఓ వైపు ఓమిక్రాన్ తో ప్రపంచం హడలిపోతుంటే… ఇప్పుడు కొత్త వెర్షన్ రావడం కలవరాన్ని కలిగిస్తుంది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ కు వచ్చిన ఓ యాత్రికుడు ఈ కొత్త వెర్షన్ తో బాధపడుతున్నట్లు అక్కడి వైద్య శాఖ తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓమిక్రాన్ కొత్త వెర్షన్ ను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది.