బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. గతంలో రాజాసింగ్ పై నమోదైన రెండు కేసుల విషయంలో గురువారం ఉదయం మంగళహాట్, షాహినగర్ గంజ్ పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆరు నెలల క్రితం నమోదైన కేసుల విషయంలో ఇప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు అంటూ పోలీసులను రాజాసింగ్ నిలదీశారు. అయితే నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామని, సహకరించాలని పోలీసులు రాజాసింగ్ ని కోరారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రాజా సింగ్ ని మరోసారి అరెస్టు చేశారు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనని మంగళహాట్ పోలీస్ స్టేషన్ కి కాకుండా ఓ రహస్య ప్రాంతానికి తరలిచ్చినట్లుగా సమాచారం. కాగా రెండు రోజుల క్రితం మహమ్మద్ ప్రవక్త పై, ఇస్లాం మతం పై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.