ఉద్యోగార్థులకు అలర్ట్.. ఇక నుంచి UPSCలోనూ వన్ ​టైమ్​ రిజిస్ట్రేషన్

-

ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు.. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు టీఎస్ పీఎస్సీ వంటి రాష్ట్ర సర్వీసులకు మాత్రమే ఉన్న ఈ ఆప్షన్ ఇప్పుడు యూపీఎస్సీకి కూడా అమలు అవుతోంది. యూపీఎస్​సీ ఉద్యోగార్థులకు మాత్రం ఇప్పటివరకు ఈ సదుపాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్​సీ కూడా తాజాగా ఓటీఆర్​ను ప్రారంభించింది.

“వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి యూపీఎస్​సీ ఏడాది పొడవునా నిర్వహించే అనేక పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకుంటారు. వారి సమయం ఆదా చేస్తూ, దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఓటీఆర్​ ప్లాట్​ఫామ్​ను ప్రవేశపెట్టాం. ఇక నుంచి యూపీఎస్​సీలోని వివిధ రిక్రూట్​మెంట్​ పరీక్షలకు అప్లె చేసుకున్నప్పుడు ప్రతిసారీ ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు.” అని ఓ సీనియర్ యూపీఎస్​సీ అధికారి తెలిపారు.

“ఉద్యోగార్థులు ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని సర్వర్​లలో సురక్షితంగా స్టోర్​ చేస్తాం. వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఉద్యోగార్థులకు చాలా ఉపయోగపడుతుంది. పొరపాటున కూడా తప్పుగా సమాచారం నమోదు అయ్యే అవకాశం ఉండదు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే అధికారిక వెబ్​సైట్​ upsc.gov.inలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. ఓటీఆర్​ సూచనలను పరిశీలించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మొదటిసారి రిజిస్టర్​ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.” అని యూపీఎస్​సీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news