ఆన్లైన్లో వరలక్ష్మీ వ్రతం- వెంటనే టికెట్ బుక్ చేసుకోండి !

-

(తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దేవాలయంలో జూలై 31న): ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు. కోవిడ్ వైరస్ కారణంగా ఆలయంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా అర్చకస్వాములు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా దేశ విదేశాలలోని భక్తులు అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని తమ తమ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చనారు. వ్రతం లో పాల్గొనాలనుకునే భక్తులు….జూలై 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి జూలై 30వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు టిటిడి వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చన్నారు.
టికెట్లు కావలసిన గృహస్తులు టిటిడి వెబ్సైట్లో తమ వివరాలు పొందుపర్చి, టిటిడి నియమ నిబంధనలకు లోబడి గేట్వే ద్వారా రూ.1001/- చెల్లించి ఆన్లైన్ రశీదు పొందవచ్చన్నారు. ఇందులో గృహస్తులకు ప్రసాదాలు అందించేందుకు పోస్టల్ సేవలు కలిపి రుసుం నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు తొలి శ్రావణ శుక్రవారం పూజలో అర్పించిన ఉత్తరియం, రవిక, పసుపు, కుంకుమ, కంకణాలు, గాజులు ప్రసాదంగా పోస్టులో గృహస్తుల చిరునామాకు పంపించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమాన్ని జూలై 31వ తేదీ ఆన్లైన్ (వర్చువల్) లో ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనే గృహస్తులు అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలు, సంకల్పం పఠించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఆన్ లైన్ లో టికెట్లు పొందిన గృహస్తుల పేరు, గోత్ర నామాల ప్రతిని అర్చకులు అమ్మవారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారన్నారు.

వరలక్ష్మీ వ్రతం పూర్తిగా ఆన్లైన్(వర్చువల్) సేవ అయినందున, ఈ వ్రతం కొరకు పేర్లు నమోదు చేసుకుని, టికెట్లు పొందిన భక్తులకు తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రత్యక్షంగా వ్రతంలో పాల్గొనే అవకాశం లేదని తెలిపారు. విదేశాలలో ఉన్న భక్తులు ఆన్లైన్ టికెట్లు పొంది ఆన్లైన్ (వర్చువల్) ద్వారా ఈ వ్రతంలో పాల్గొనవచ్చు, కానీ వారికి ప్రసాదాలు పంపడం సాధ్యం కాదని తెలియజేశారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news