హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజావాణి ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనూహ్యంగా సోమవారం బాధితులు ఫిర్యాదులతో భారీ ఎత్తున హైడ్రా ఆఫీస్ కు వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా కమిషనర్ రంగనాథ్ ను కలిసి కబ్జాదారుల ఆగడాలపై సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఎక్కువ సమయం తీసుకోమని.. 15 రోజుల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సంపత్ నగర్ వెంచర్ లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరూ వ్యక్తులు ఆక్రమించారని.. అలాగే ఊట్ పల్లిలో 40 ఫీట్ల రోడ్డు ఆక్రమించి గేటు ఏర్పాటు చేసాడని కొద్ది రోజుల క్రితం స్థానికులు అధికారులు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు ఉదయమే అక్కడకు వెళ్లి అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేశారు.