కరోనా లక్షణాల తీవ్రత అంతగా లేని, సాధారణ లక్షణాలు ఉన్నవారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయడం లేదు. కేవలం తీవ్రమైన కరోనా లక్షణాలు ఉన్నవారికి, ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇకపై గాంధీలో చికిత్స అందించనున్నారు. మరో 14 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి చెందిన ప్రభుత్వ సీనియర్ వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక కరోనా లక్షణాలు అంతంత మాత్రంగానే ఉన్నవారు ఇండ్లలోనే ఉండి వైద్య సహాయం తీసుకోవాలి. వారు ఇండ్లలో ప్రత్యేక రూంలలో ఉండాలి. కుటుంబ సభ్యులు వారి గదిలోకి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లరాదు. వారికి ప్రత్యేక బాత్‌రూం కేటాయించాలి. ఆహారం, ఇతర వస్తువులను గది బయట డోర్ వద్ద ఉంచాలి. అలాగే మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ఈ క్రమంలో కరోనా సాధారణ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, వాంతులు తదితర సమస్యలకు మెడిసిన్లు వేసుకోవచ్చు దీంతో 3 నుంచి 5 రోజుల్లో లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అదే జరిగితే కరోనా నుంచి కోలుకుంటున్నట్లు లెక్క. దీంతో వారు హాస్పిటల్‌కు రానవసరం లేదు. వారు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ ఐసొలేషన్ పాటిస్తే చాలు. 14 రోజుల్లో వ్యాధి తగ్గుతుంది.
అయితే ఇండ్లలో ప్రత్యేకమైన గదులు లేని వారు ప్రభుత్వ సహాయం పొందవచ్చు. అందుకు గాను హైదరాబాద్ నగరంలో అలాంటి వారికి నేచర్ క్యూర్ హాస్పిటల్, గచ్చిబౌలి హాస్పిటల్‌లలో షెల్టర్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్లవచ్చు లేదా ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లవచ్చు. ఇక ఇండ్లలో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకునే వారు ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యుల సూచన మేరకు మందులను వాడవచ్చు. అయితే కరోనా లక్షణాలు తగ్గకుండా పరిస్థితి తీవ్రతరమైన వారికి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారు 5 నుంచి 12 గంటల్లోగా హాస్పిటల్‌లో చేరి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకోవచ్చు. దీంతో వారికి ముందుగా ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తారు. కాగా ఈ వివరాలను పలువురు వైద్యులు మీడియాకు తెలిపారు.