స్వతంత్ర భారత చరిత్రలో కేవలం రెండు పార్టీలు మాత్రమే 25 సంవత్సరాల పాటు మనగలిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ మాత్రేమే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు.
2001లో కేసీఆర్ పార్టీని ప్రారంభించినప్పుడు ఆయన ఒక్కరే ఆయన వెంట ఇంత బలగం లేదు.కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం బలంగా ఉన్నాయి. వాటితో పాటు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఉంది.
ఈ మూడు పార్టీలను తట్టుకొని ఎదిరించి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ కోసం నిజంగానే ఎవరైనా కొట్లాడుతారా? లేదంటే తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఆకాంక్షను అమ్మేసుకుంటారా అన్న అపనమ్మకం ప్రజల్లో ఉండేది.370 మంది విద్యార్థుల త్యాగాల మీద 1971లో గెలిచిన నాటి తెలంగాణ ప్రజా సమితి నాయకులు కాంగ్రెస్ లో కలవడమే అందుకు కారణం.
ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కుల, ధన, అంగ బలం ఏవి లేకుండానే కెసిఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.తొలి దేశ ఉద్యమంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని గడ్డిపోచలాగా వదులుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన సొంత స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ఇచ్చారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం లేకుండా చేయడానికి నాటి సమైక్య శక్తులు ఎన్నో కుట్రలు చేశాయి. ఇన్ని ప్రతికూలతల మధ్యలో ఉద్యమ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదు’ అని అన్నారు.