కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోని మహానగరాల్లో ఒకటైన బెంగళూరులోనూ కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. దీంతో అక్కడ జూలై 14వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. అయితే అక్కడ తాజాగా ఓ షాకింగ్ విషయం తెలిసింది. కోవిడ్ కాంటాక్ట్ అనుమానితులుగా భావిస్తున్నవారిలో 23వేల మంది తమ చిరునామాలను తప్పుగా ఇచ్చారని తేలింది. దీంతో అక్కడి అత్యవసర సేవల సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.
బెంగళూరులో హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను అక్కడ సిటిజెన్స్ క్వారంటైన్ స్క్వాడ్ పేరిట ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో వాలంటీర్లుగా ఎవరైనా చేరవచ్చు. ఈ క్రమంలో వారు అక్కడ హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హోం క్వారంటైన్‌లో ఉన్న అనుమానితులను 2, 5, 10, 14వ రోజు వారి ఇండ్లకు వెళ్లి పరిశీలించాలి. తరువాత వాలంటీర్లు తమకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక యాప్‌లో సదరు క్వారంటైన్ అనుమానితుల వివరాలను నమోదు చేయాలి. అయితే అలా ఆ అనుమానితులను పర్యవేక్షించేందుకు వెళ్తున్న వాలంటీర్లకు షాక్ తగులుతోంది. ఎందుకంటే.. కొన్ని వేల మంది అనుమానితులు తప్పుడు చిరునామాలను ఇచ్చారు. దీంతో వారిని గుర్తించడం వాలంటీర్లకు కష్టంగా మారింది.
బెంగళూరులో మొత్తం 69,297 మంది హోం క్వారంటైన్‌లో ఉండాలి. కానీ 46,113 మంది మాత్రమే సరైన చిరునామాలు ఇచ్చారు. దీంతో వారిపై వాలంటీర్లు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. కానీ మిగిలిన 23,184 మంది వివరాలు తెలియడం లేదు. వారు తప్పుడు చిరునామాలు ఇవ్వడంతో వారిని కనుక్కోవడం కష్టంగా మారిందని వాలంటీర్లు అంటున్నారు. వాలంటీర్లు ఆ చిరునామాలకు వెళితే అక్కడ క్వారంటైన్‌లో ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదు. దీంతో వాలంటీర్లకు ఏం చేయాలో తెలియడం లేదు. అయితే ఇది పొరపాటా ? లేక జనాలు కావాలనే తప్పుడు చిరునామాలు ఇచ్చారా ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఈ విషయం మాత్రం అక్కడి జనాల్లో మరింత భయాన్ని కలిగిస్తోంది.