మూడేళ్లలో 4లక్షలకు పైగా అత్యాచార కేసులు: స్మృతి ఇరానీ

-

చిన్నారులపై లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద గత మూడేళ్లలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.

sruthi irani
sruthi irani

ఈ సందర్భంగా మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. మూడేళ్లలో చిన్నారులపై 4,12,142 అత్యాచార కేసులు నమోదయ్యాయని అన్నారు. వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 1,023 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయబోతుందన్నారు. సెక్షన్ 35(2) ప్రకారం నేరం జరిగిన ఏడాదిలోపు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో కేసుల విచారణ పూర్తి చేసి బాధితులను న్యాయం కల్పించాలన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో 389 కోర్టులు కేవలం కేసుల విచారణకే కేటాయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను త్వరలో పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

గతేడాది డిసెంబర్ చివరి నాటికి 609 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు అందుబాటులో ఉన్నాయని, వీటిలో పోక్సో చట్టానికి సంబంధించినవి 331 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయని మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. దేశంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. నేరాలు జరుగుతూనే ఉన్నాయని.. వీటిపై కఠిన చట్టంను అమలు చేస్తూ.. నిబంధనలు కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా, మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. బాధితులకు వారి స్వగృహంలో సంరక్షణ లేకపోతే వారిని బాలల సంక్షేమ సమితి ఎదుట 24 గంటల్లో హాజరు పరచాలి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన బాధితురాలికి ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీని అందజేస్తారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, గౌరవానికి, ఏకాంతానికి భంగం కలిగించే ఏ విషయాన్ని పోలీసులు బహిర్గతం చేయరాదు. నిందితులకు శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news