కాంగ్రెస్-లో అంతర్గత దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త రక్తం ఒకటి కావాల్సి ఉంది. ఇందులో భాగంగా రాజస్థాన్, ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శివిర్ కొన్ని మార్పులకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ చేపట్టనున్న భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి పూర్వ వైభవం ఇస్తుందని భావిస్తోంది. అదేవిధంగా ఇప్పుడున్న అడ్డంకులను సునాయాసంగా అధిగమిస్తామని, కాంగ్రెస్ కొత్త ఉదయాన్ని తప్పక చూస్తుందని సోనియా అంటున్నారు. ఇదే మా నవ సంకల్పం అని కూడా చెబుతున్నారు.’
వాస్తవానికి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నా అది ఒక కుదరని పనిలానే ఉంది. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ కోలుకోలేనంత దీనావస్థల్లో ఉంది. ఒకప్పుడు పార్టీకి నారు నీరు పోసి పెంచిన వారంతా ఇప్పుడు తలో దిక్కుకూ వెళ్లిపోయారు. ఆశించిన స్థాయిలో పార్టీ మనుగడ అయితే లేదు. దక్షిణాదిలో చెప్పుకోదగ్గ బలం లేదు. ఒకప్పుడు ఈ ప్రాంతం ఫలితాల ఆధారంగానే కాంగ్రెస్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం అయ్యేది. ఇక ఉత్తరాది నేతల్లో కూడా గతం కన్నా ఇప్పుడు సఖ్యత లేదు. ప్రాంతీయ పార్టీల హవాలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం క్రమ క్రమంగా కోల్పోతూ వస్తోంది. శక్తి ఉన్నంత వరకూ కాంగ్రెస్ ఏదో ఒక విధంగా నెగ్గుకు వస్తుందని అనుకోలేం.
నవ సంకల్ప చింతన శిబిరం తరువాత అయినా మార్పులు వస్తాయా అంటే అదీ చెప్పలేం. బలమైన బీజేపీని ఢీ కొట్టడం అనుకున్నంత సులువేం కాదు. ఆశించిన స్థాయిలో యోధులు ఉన్నప్పుడే యుద్ధం కూడా సఫలీకృతం అవుతుంది. కానీ పార్టీకి
యోధులు లేరు. కార్యకర్తలు కొన్ని ప్రాంతీయ పార్టీల వైపు మనసు పారేసుకున్నారు. అక్కడే ఏదో ఒక విధంగా సర్దుకుపోతున్నారు. క్రియాశీలక నాయకులు ఎవ్వరూ క్షేత్ర స్థాయిలో లేరు. కనుక ఒకప్పటి కన్నా ఇప్పుడు బీజేపీ వ్యతిరేకతను తమకు అనుగుణంగా మార్చుకోవడం కష్టమే ! ఈ దశలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలంటే పార్టీ లో అధినాయకత్వంలో మార్పులు రావాల్సి ఉందన్న అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి గాంధీల కుటుంబ పాలన వద్దన్నది ఓ వాదన. కానీ దానికి అంగీకరించేందుకు సోనియా సిద్ధంగా లేరు.