యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన మహ్మదాలీ జిన్నా వ్యాఖ్యలు పొలిటికల్ పార్టీల మధ్య మాటల మంటలను రేపుతున్నాయి. ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..’ పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మదాలీ జిన్నాను సర్ధార్ వల్లబాయ్ పటేల్, గాంధీ, నెహ్రూలతో పోల్చడం, భారత స్వాతంత్య్రంలో కీలక భూమిక పోషించారు‘ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయ్యింది. అయితే ఈ వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీలు అఖిలేష్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా అఖిలేష్ వ్యాఖ్యలపై స్పందించారు. ’భారత దేశం ముస్లీంలతో జిన్నాకు ఎటువంటి సంబంధం లేదని, అఖిలేష్ యాదవ్ ఆయన సహాయకులను మార్చుకోవాలని, స్వయంగా చరిత్రను చదువుకోవాలని‘ హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఒక వర్గాన్ని ఆకట్టుకోవాలని చూస్తే అది భ్రమే అవుతుందని ఓవైసీ అన్నారు.
మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అఖిలేష్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఎస్పీలు రెండూ మతతత్వం, కులతత్వంతో రాజకీయాలు చేసే పార్టీలే అని, ప్రజల్ని విభజించడం వారిపని అని విమర్శించారు. బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించింది. అఖిలేష్ తాలిబన్ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని విమర్శించింది.