ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తనది కాదని, అలా అని ప్రధాని మోదీ, అమిత్ షాలదీ కాదని, థాక్రేలది అస్సలు కాదని ఓవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారతదేశం ద్రవిడియన్లు, ఆదివాసీలదని ఆయన తెలిపారు. శనివారం మహారాష్ట్రలోని బీవండిలో జరిగిన సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎవరికి వారు భారతదేశం తమదంటూ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నిజానికి ఆఫ్రికా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా, ఇరాన్ నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందన్నారు. అలా చూస్తే భారత్ ద్రవిడియన్లు, ఆదివాసీలకు సొంతం అన్నారు.
భారత దేశంలోకి మొగల్స్ వచ్చి వెళ్లిన తర్వాతే.. ఆర్ఎస్ఎస్, బీజేపీ వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ మేరకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మండిపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్ పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదన్నారు. ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలని పేర్కొన్నారు. సంజయ్ రౌత్‌పై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా శరద్ పవార్ ప్రధాని మోదీని కలిశారని విమర్శించారు. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయినప్పుడు తనకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు.