అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి అవినీతి నిరోధక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అల్‌జజియా స్టీల్ మిల్స్ అవినీతి కేసులో నవాజ్‌షరీఫ్ దోషిగా తేలడంతో ఆయనకు శిక్ష ఖరారు చేసింది. అయితే పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ కేసులో మాత్రం ఆయన్ను కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. అల్ జజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్‌షరీఫ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నందున ఆయన్ను దోషిగా నిర్ధారిస్తున్నామని అకౌంటబులిటీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అర్షద్ మాలిక్ తన తీర్పులో వివరించారు. అవెన్‌ఫీల్డ్ ప్రోపర్టీస్, ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్స్, అల్ జజియా స్టీల్‌మిల్స్ కేసులపై దర్యాప్తును జాతీయ అకౌంటబులిటీ బ్యూరో గత ఏడాది సెప్టెంబర్ 8న ప్రారంభించింది.
ఈ కేసుల్లో షరీఫ్‌తో పాటు నిందితులైన ఆయన కుమార్తె మర్యం, అల్లుడు మహ్మద్ సఫ్దార్‌లకు వరుసగా 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గత జులైలో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మూడు అవినీతి కేసుల్లో నిందితుడిగా కేసులు నమోదు కావటంతో పాక్ సుప్రీంకోర్టు నవాజ్‌షరీఫ్‌పై గత ఏడాది జులైలో అనర్హత వేటు వేయడంతో ఆయనపై విచారణ వేగవంతం చేశారు.