ఎన్నికలు సమీపిస్తుండటంతో…కేంద్రానికి గుర్తుకొస్తున్న ఓటర్లు..

-

ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సారి ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే  వస్తు సేవల పన్నుపై (జీఎస్‌టి)లో సరళీకరణపై మోడీ సర్కార్‌ దృష్టి పెట్టింది. ఈ పన్ను విధానంపై సామాన్య ప్రజానికం దగ్గర నుంచి  వ్యాపార వర్గాల వరకు అందరూ గుర్రుగా ఉండటంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహంలో భాగంగా 99 శాతం వస్తువులను 18 శాతం అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో దేశంలో కేవలం మూడే జీఎస్‌టి శ్లాబ్‌లను అమలులోకి తేనున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. జీఎస్‌టిని రానున్న రోజుల్లో మరింతగా సరళతరం చేయనున్నామని ఆయన వెల్లడించారు. జీఎస్‌టి లో అత్యధిక పన్ను శ్లాబు అయిన 28 శాతాన్ని క్రమంగా తొలగిస్తామని.. 12 శాతం, 18శాతం శ్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.. ఈ నేపథ్యంలో జిఎస్‌టి వ్యవస్థ అమలు అసలు ప్రభావం అంటూ పేర్కొన్నారు జీఎస్‌టి రాక ముందు ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత దారుణమైన పరోక్ష పరోక్ష పన్ను వ్యవస్థ దేశంలో అమలులో ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ తమ హాయాంలో జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత 31శాతం అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28 శాతం శ్లాబులో చేర్చామని తెలిపారు. సామాన్యులు వినియోగించే ఎన్నో నిత్యావసర వస్తువులపై జీరో, లేదా 5 శాతం జిఎస్‌టి శ్లాబుల్లోకి చేరిపోయాయని ఆయన అన్నారు. నిత్యం వినియోగించే 1216 వస్తువుల్లో.. 183 రకాల వస్తువులపై ఎలాంటి పన్ను లేదని తెలిపారు. 5శాతం శ్లాబులో 308 వస్తువులు, 12శాతం శ్లాబులో 178 వస్తువులు, 18శాతం శ్లాబులో 517 వస్తువులున్నాయని వెల్లడించారు. 18నెలల జీఎస్‌టి పేరుతో జైట్లీ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక పోస్టును ఉంచారు. ఏది ఏమైనా తాము అనుసరించిన విధానాల వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని భాజపా ప్రభుత్వం గమనించిందనుకుంటా…అందుకే ఇప్పుడు జీఎస్టీ లో దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news