Parental Tips : పిల్లలు చూస్తున్నారు.. జాగ్రత్త..!

-

ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులే హీరోలు. వారు ఏం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. చిన్నారుల గ్రహణ శక్తి చాలా బలంగా ఉంటుంది. ఏదైనా చూసిన వెంటనే నేర్చేసుకుంటారు. అందుకే పిల్లల ముందు మీరు మాట్లాడే మాటలు, చేసే పనుల్లో జాగ్రత్త వహించాలి. లేకపోతే చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు మీ నుంచే పిల్లలు నేర్చుకునే సమస్య ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అమ్మానాన్నల పెంపకం, జీవనశైలి, ఎదుటివారిపై వారు చూపే ప్రేమ, కరుణ వంటివెన్నో పిల్లలపై ప్రభావం చూపుతాయని, అవే వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమవుతాయని అంటున్నారు.

పిల్లలు అమ్మానాన్నలనే చిన్నప్పటి నుంచి తమ కథానాయకులుగా భావిస్తారు. వారు చేసే ప్రతి పనీ అద్భుతంగా కనిపిస్తుంది. తమ తల్లిదండ్రులని ఉన్నత వ్యక్తులుగా భావిస్తారు. అటువంటి వారి ఆలోచనను పెద్దవాళ్లు నిజం చేయాలి. నడవడికలో వారికి స్ఫూర్తిగా మారాలి. చెప్పడం కన్నా ఎలా జీవించాలో ఆచరించి చూపిస్తే చాలు. తల్లిదండ్రులను హీరోలుగా అనుకోవడమే కాదు, వారినే అనుసరిస్తారు.

లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయడం, ఇతరులను ప్రేమించడం, కష్టంలో ఉన్నవారికి చేయూతనందించడం వంటి జీవితపు విలువలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవరచాలి. కష్టపడితేనే కావాలన్నది దక్కుతుందనే విషయం బాల్యంలోనే నేర్పాలి. ఏదైనా బొమ్మ కావాలని అడిగినప్పుడు వెంటనే కొనివ్వకుండా, దానికి వారికి చేతనైన పని ఏదైనా పూర్తి చేయాలనే నిబంధన పెట్టాలి. అప్పుడే ఏదీ తేలికగా దక్కదనే ఆలోచన ఆ బుజ్జాయి మనసులో నాటుకుంటుంది. అలా కష్టపడేతత్వం అలవడుతుంది.

ఏ పని చేయాలన్నా పెద్ద వాళ్లు నియమిత సమయాన్ని కేటాయించుకొని పూర్తిచేయాలి. వంట, ఇంటి శుభ్రం లేదా దుస్తులు సర్దడం వంటి పనులకు సమయాన్ని పెట్టుకొని పూర్తిచేసి, ఆ తర్వాత మరో పనిలోకి అడుగుపెట్టాలి. ఇలా తల్లిదండ్రులు సమయానికి విలువ ఇచ్చి వినియోగించుకోవడం చూసినప్పుడు, పిల్లలు దాన్నే అనుసరిస్తారు. సమయపాలన అంటే అర్థమవుతుంది. ఇది వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది.

 

పంచుకోవడం ఇంట్లో అమ్మకు నాన్న పనిలో సాయం చేయడం, నాన్నకు అవసరమైనవాటిని అమ్మ అందించడంవంటివన్నీ పిల్లల్లో పని పంచుకోవడమెలాగో నేర్పుతుంది. ఇతరుల అవసరం, కష్టాన్ని గుర్తించి వారికి తాము చేయగలిగే సాయాన్ని అందించాలని తెలుసుకుంటారు.

అందరికన్నా ముందు నిద్రలేచి కుటుంబ అవసరాలను తీర్చే అమ్మను చూసి పిల్లలు క్రమశిక్షణ నేర్చుకుంటారు. పరస్పరం గౌరవించుకుంటూ మర్యాద పూర్వకంగా మాట్లాడుకునే అమ్మానాన్నల నుంచి ఇతరులతో ఎలా సంభాషించాలన్నదానిలో తెలియకుండానే శిక్షణ పొందుతారు. ఇంటిల్లి పాదినీ ప్రేమగా, బాధ్యతగా చూసుకునే తల్లిదండ్రుల మంచి అలవాట్లు పిల్లల జీవితంలో మరవలేని మైలురాళ్లుగా నిలిచి పోయి, వారిని ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news