సాధారణంగా మన బంధుమిత్రులను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌లోకి వెళ్తుంటాం. రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకుంటాం. ఈ టికెట్ తీసుకున్న తర్వాత స్టేషన్లో ఉండేందుకు పరిమిత సమయం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం బైక్ పైన లేదా కార్లో వెళ్ళినప్పుడు కొద్ది నిమిషాల్లోనే వస్తామని ఎక్కడో ఓ చోట పెడతాం. ఇలాంటి సమయంలో అదనపు సమయం తీసుకుంటే ఇక నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ జరిమానా చెల్లించవలసిందే.
కారును పార్కింగ్ స్థలంలో కాకుండా స్టేషన్ ప్రవేశద్వారం లేదా దాని చుట్టుపక్కల పెట్టి లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి రావాలి. 5 నిమిషాలకు మించి కాస్త ఆలస్యం అయినా జరిమానా నుంచి తప్పించుకోలేరు. ఆలస్యాన్ని బట్టే జరిమానా విధిస్తారు. ఆలస్యాన్ని బట్టి రూ. 100 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రద్ధీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్లలో దశలవారీగా దీనిని అమలు చేయనున్నారు. తొలుత సికింద్రాబాద్ స్టేషన్‌లో బోయిగూడ వైపు ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
5 నిమిషాలు ఆలస్యమైనా రూ. 100 నుంచి అరగంట వరకు ఆలస్యమైతే రూ. 1000 వరకు వసూలు చేస్తారు. బోయిగూడ ద్వారా స్టేషన్ లోపలికి వచ్చే వాహనాలను గుర్తించేందుకు సికింద్రాబాద్ స్టేషన్‌లో సీసీ కెమెరాలతో పాటు ఓ ప్రత్యేక బూత్ ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి వాహనం వివరాలను నమోదు చేస్తారు. వచ్చిన సమయం తెలుపుతూ రిసిప్ట్ ఇస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ రిసిప్ట్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఐదు నిమిషాలు దాటితే ఫైన్ వేస్తారు. ఒకవేళ రసీదు పోతే రూ. 500 వరకు కట్టాలి. ట్రాఫిక్ సమస్యలను అదుపు చేయడానికే జరిమానాలు విధించాల్సి వస్తుందని అధికారులు తెలుపారు.