త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీకి టైటిల్ స్పాన్సర్‌గా వివో తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్లను వెదికే పనిలో పడింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి సంస్థలు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో ముందుండగా.. ఇప్పుడు మరో కంపెనీ కూడా వచ్చి చేరింది. యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలో నడుస్తున్న పతంజలి గ్రూప్ కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్పాన్సర్‌షిప్ కు గాను పతంజలి బిడ్ కూడా వేయనుందని సమాచారం.
దేశవ్యాప్తంగా పతంజలి సంస్థ ఎంత పేరుగాంచిందో అందరికీ తెలిసిందే. అయితే దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం కోసం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ గా వ్యవహరించాలని ఆ కంపెనీ ఆలోచిస్తున్నదట. అందుకనే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులోకి తాజాగా పతంజలి వచ్చి చేరింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వివో తప్పుకోవడం వల్ల బీసీసీఐకి దాదాపుగా రూ.440 కోట్ల నష్టం వస్తుందని మొదట్లో అంచనా వేసినా.. ప్రస్తుతం అనేక కంపెనీలు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కు ముందుకు వస్తుండడంతో బీసీసీఐకి కలిగే నష్టం తప్పుతుందని తెలుస్తోంది.
కాగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు యూఏఈలో ఐపీఎల్ టోర్నీ జరుగుతుంది. ఇందుకు గాను ఫ్రాంచైజీలు, ప్లేయర్లు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఆగస్టు 20వ తేదీ తరువాత ఆయా జట్లకు చెందిన సభ్యులు, సిబ్బంది యూఏఈకి వెళ్లి అక్కడ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారని తెలుస్తోంది.