లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై దాడి ఘటనపై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. ప్రస్తుతం ఈ దాడి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతున్నది. పరిగి పోలీస్ స్టేషన్‌లో మహేశ్ భగవత్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి ఫోన్‌ను పోలీసులు ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్ర జరిగినట్లు ఆయన చాటింగ్ లిస్టును గుర్తించారు. కాగా, ఈ కేసులో నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
అంతకుముందు నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.మరోవైపు కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.