బాబుని అరెస్ట్ చేయాలి..కే‌ఏ పాల్-శ్రీరెడ్డి డిమాండ్.!

-

కందుకూరు ఘటన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే‌ఏ పాల్, వైసీపీకి మద్ధతు పలికే శ్రీరెడ్డి డిమాండ్ చేశారు. డిసెంబర్ 28న చంద్రబాబు కందుకూరులో రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సర్కిల్‌లో సభ పెట్టగా భారీగా జనం రాగా, తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. దీంతో వెంటనే బాబు సభ ఆపేసి..కార్యకర్తల కోసం హాస్పిటల్‌కు వెళ్లారు..కానీ అప్పటికే కొందరు ప్రాణాలు విడిచారు.

మొత్తం మీద 8 మంది చనిపోగా, కొందరు గాయపడ్డారు. చనిపోయిన కుటుంబాలకు టీడీపీ తరుపున 25 లక్షల సాయం అందించారు. చనిపోయిన కుటుంబాలని బాబు పరామర్శించారు. గాయపడిన వారికి ఆర్ధిక సాయం చేశారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సాయం ప్రకటించాయి. అయితే బాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల డ్రోన్ కెమెరాలతో ఎక్కువ మందిని చూపించాలని ఇరుకు రోడ్డులో సభ పెట్టి 8 మంది ప్రాణాలని తీశారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. జగన్ సైతం అదే తరహాలో విమర్శ చేశారు.

కాకపోతే ఎవరు బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయలేదు. జగన్ అభిమానిగా ఉన్న శ్రీరెడ్డి మాత్రం బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 8 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏమనాలని మండి పడ్డారు.  చంద్రబాబు తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని, చంద్రబాబుపై కోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలని.. ఇది రాజకీయ హత్య అన్నారు.

 

అటు కే‌ఏ పాల్ సైతం..బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయాలని చూశారు..కానీ ఆఫీసు లోపలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బయటే ఉండి నిరసన తెలిపారు. విచారణ పూర్తి అయ్యేంత వరకు చంద్రబాబు రోడ్ షోలు, సభలకు పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని, ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బిర్యానీ, మందు, డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి చంపుతారా? అని నిలదీశారు. చంద్రబాబు మనవడుకు నలుగురు గన్‌మెన్లు ఎందుకని..తన కొడుకు, మనవడుకు ఇలాగే జరిగితే చంద్రబాబు సభలు పెడతారా అని కేఏ పాల్ ప్రశ్నించారు. మరి శ్రీరెడ్డి-పాల్ డిమాండ్‌పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version