దుబ్బాక ప్రచారం పై డిఫెన్స్ లో పవన్..ఎదురు దాడి మొదలెట్టిన టీఆర్ఎస్…!

-

జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ కల్యాణ్‌ దుబ్బాక ఉపఎన్నిక‌ల ప్రచారానికి వెళ‌తారా లేదా? ఈ అంశమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ నుంచి రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. బీజేపీ ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే జనసేనానిని ప్రచారానికి రప్పించేందుకు ప్లాన్‌ చేస్తోందట. ఒకటి రెండు రోజులైనా పవన్‌ ప్రచారం చేస్తే యూత్‌ ఓటర్లను ఆకర్షించవచ్చునన్నది బీజేపీ ఆలోచన. తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలు ఈ మధ్యే పవన్‌తో సమావేశమయి బీజేపీ తరఫున ప్రచారం చేయాలని కోరారట.

దుబ్బాక‌లో గ్రౌండ్ రియాల్టీని జ‌న‌సేన టీం అంచ‌నా వేస్తోంది. ఎవ‌రికి గెలుపు అవ‌కాశాలున్నాయి? బీజేపీకి ఎంత శాతం ఓట్లు వ‌స్తాయి? ప‌వ‌న్ వెళ్లడంవ‌ల్ల ప్రయోజనం ఎంత? ప్రత్యేక ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న ఈ ఉపఎన్నిక‌ ప్రచారానికి వెళ్లాలా వ‌ద్దా? అన్న ప్రశ్నలకు స‌మాధానం వెతికే ప‌నిలో జనసేన ఉందట. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు లేదా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వైపు చూడలేదు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. అభ్యర్థులను నిలబెట్టలేదు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. GHMC ఎన్నికల షెడ్యూల్‌ దగ్గర పడుతుండటంతో ఈ మధ్యే ఇంఛార్జులతో ఓ కమిటీని ప్రకటించారు జనసేనాని.

ఒక‌వేళ దుబ్బాక ఉపఎన్నిక‌ ప్రచారానికి వెళ్తే GHMC ఎలక్షన్స్‌లో ఏం చేయాల‌న్న దానిపై కూడా జనసేనలో మంత‌నాలు జ‌రుగుతున్నాయి. గ్రేట‌ర్‌లో బీజేపీకి మద్దతివ్వాలా.. పొత్తు పెట్టుకోవాలా? సొంతంగా అభ్యర్థులను నిలబెట్టాలా? అన్న దానిపై కూడా చర్చ నడుస్తోందట. అయితే ప‌వ‌న్ కల్యాణ్‌ దుబ్బాక టూర్ తేల‌క‌ముందే టీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్పుడే సోష‌ల్ మీడియాలో ఎదురుదాడి ప్రారంభించాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు ప‌వ‌న్ చేసిన ప్రసంగాలను, కామెంట్స్‌ను వైరల్‌ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version