అసెంబ్లీకి పవన్… జనసైనికుల భయంలో న్యాయమెంత!?

-

ఒకపక్క విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. మరోపక్క చెప్పడమే ఆలస్యం చేసుకుపోయే కార్యకర్తల బలం ఉన్న పార్టీగా జనసేనను అభివర్ణిస్తుంటారు రాజకీయ విశ్లేషకులు! పవన్ కి ఉన్న యూత్ ఫాలోయింగ్ లో భాగంగా… 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నోకొన్ని సీట్లు సంపాదిస్తాదనుకున్న పార్టీలో పవన్ కూడా గెలవకపోవడం అప్పట్లో సంచలన విషయమే! పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కు ఎదురుదెబ్బే తగిలింది. ఇక మిగిలినచోట్ల డిపాజిట్ కూడా చాలవరకూ దక్కని పరిస్థితి! రాజోలు నియోజకవర్గంలో రాపాక కాపాడబట్టి సరిపోయింది కానీ… లేదంటే అసెంబ్లీలో ఆ పార్టీ అడుగుపెట్టేది కూడా కాదు! అది గతం అనుకుని కాసేపు సర్ధుకున్న జనసైనికులకు తాజాగా పవన్ ప్రవర్తన ఇబ్బంది పెడుతుందట! ఈ క్రమంలో భవిష్యత్తులో పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారు? పవన్ కు అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం ఉందా? అనే అంశంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా చర్చలు నడుస్తున్నాయి!

గోదావరి జిల్లాలో పవన్ కు ఉన్న సినిమా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుది కాదు. అతని సొంత సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్న ఈ ఉభయ గోదావరి జిల్లాలలో కూడా పవన్ పోటీ చేసినా… పక్క జిల్లా సంగతి దేవుడెరుగు, కనీసం పక్క నియోజకవర్గంలో కూడా ఆ ప్రభావం కనిపించలేదు! ఈ క్రమంలో తూగో – పగో అయిపోయినట్లే అన్న వాదనలు వినిపిస్తోన్న తరుణంలో… కృష్ణా – గుంటూరు నుంచి పవన్ కు ఆ అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే… గాజువాక రూపంలో 2019 గట్టి దెబ్బే కొట్టి.. ఉత్తరాంధ్రపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పింది!

ఈ క్రమంలో పవన్ కి ఉన్న ఆశ రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలే అని జనసైనికులు బలంగా నమ్మారు! ఈ సమయంలో అవే కాస్త సేఫేమో అనుకున్నారు! ఇంతలోనే పోతిరెడ్డిపాడు జలల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇది నిజంగా రాయలసీమలో బలం పెంచుకోవడానికి మంచి అవకాశం అని జనసైనికులు భావించారు. కానీ… ఈ జిల్లాల విషయంలో కూడా పవన్ తనకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేతులారా పాడుచేసుకుంటున్నారు! దీంతో… పవన్ ఇక అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇప్పట్లో కష్టమే అనే కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి!

ఇక పవన్ కు ఉన్న రెండే రెండు అవకాశాలు ఏమిటంటే… బీజేపీతో ఎలాగూ దోస్తీ కట్టారు కాబట్టి రాజ్యసభ సీటు సంపాదించుకునీ హస్తినకు పయనమవడం. లేదా… లోకల్ గా టీడీపీతో జతకట్టి వారి నుంచి ఒక ఎమ్మెల్సీ స్థానం సంపాదించుకోవడం అని! అయితే… శాసనమండలి రద్దు విషయంలో జగన్ సీరియస్ గా ఉండటంతో ఆ ఆశ కూడా అడియాశ అయిన పరిస్థితి! ఈ క్రమంలో పవన్ పాతచింతకాయ పచ్చడి రాజకీయాలు.. బాబు వెనక తిరిగే ఆలోచనలు మాని సొంతంగా రాజకీయాలు చేస్తూ, ప్రజల్లోకి బలంగా, సొంతంగా వెల్లగలిగితే తప్ప… అసెంబ్లీలో అడుగుపెట్టడం కష్టమే అనేది బలంగా వినిపిస్తోన్న మాట! ఈ విశ్లేషణకు అప్పుడే తొందరేముంది అని అనిపించినా… వచ్చిన ప్రతీ అవకాశాన్ని పవన్ దుర్వినియోగం చేసుకుంటున్న పరిస్థితులను గమనిస్తే… సరే అనిపించక మానదు!!

Read more RELATED
Recommended to you

Latest news