జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా తెదేపా, వైకాపా నేతలపై విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మంగళవారం ధర్మవరంలో చేనేత కార్మికులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయ పార్టీల నేతలు తమ పేరు చివరన ఉన్న తోకలను తొలగించుకుంటారా అంటూ పవన్ ప్రశ్నించారు. సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని సహించలేకే తాను సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాష్ట్రానికి పాతికేళ్ల మంచి భవిష్యత్ అందిచడమే తన లక్ష్యమన్నారు. కష్టాలున్నంత మాత్రాన తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను వదులుకోమని… అలాగే చేనేత రంగాన్ని కూడా వదులుకోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు.
అభివృద్ధిలో తనకు తానే సాటి అని చెప్పుకునే నేతలకి నేతన్నల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చేనేత కళాకారుల కష్టాలను తెలుసుకునేందుకు జనసేన పార్టీ చేనేతకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారుచేసి దేశం గర్వంచేలా చేసిన చేనేత కళాకారులు నేడు ఆకలి, అఫ్పులతో చనిపోతున్నారంటే సిగ్గుచేటన్నారు. అమరావతిలో కార్ రేసింగ్, బోట్ రేసింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం చేనేత కార్మికుల కష్టాలు తీర్చలేదా? అంటూ నిలదీశారు.