రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అత్యంత సహజం. విమర్శలు చేయడానికి ఆయా నాయకులకు ఎలాంటి స్థాయి అవసరం లేదు, విషయ పరిజ్ఞానం అంతకన్నా అవసరం లేదు.. నాలుగు మాటలు మాట్లాడగలిగే వాక్చాతుర్యం ఉంటే చాలు! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఏపీ అధికారులపై టంగ్ స్లిప్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియదు కానీ… కరోనా నివారణ చర్యల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించారని, ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
వివరాళ్లోకి వెళ్తే… కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పవన్ కల్యాణ్ ఫైరయ్యారు! కరోనా కూడా ఒకరకమైన సాధారణ జ్వరం అని భావించమనడం… జనాలను భయబ్రాంతులకు గురిచేయకుండా ఉండటానికే జగన్ ఉద్దేశ్యం అని ఏపీ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చినా ఇంకా అవే విమర్శలు చేస్తున్నారు అనే సంగతి కాసేపు పక్కన పెడితే… ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కరోనాను సాధారణ జ్వరం అని తేలిగ్గా మాట్లాడటం వల్లే నివారణ చర్యల్లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు పవన్. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే అది వారి వారి సంగతి కానీ… పగలనక, రాత్రనక, ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా సమయంలో పని చేసిన అధికారుల విషయంలో… రాజకీయ రంగు పులిమి… అలసత్వం ప్రదర్శించారని అనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
పవన్ రాజకీయ విమర్శలు కాసేపు పక్కన పెడితే… ఏపీలో కరోనా నియంత్రణ చర్యల గురించి, లక్షకు పైగా చేసిన టెస్టుల గురించి, ఈ సమయంలో కూడా చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులగురించి, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేయడానికి, మామిడి పండ్లు విదేశాలకు ఎగుమతులు చేయడానికి, దాన్యాన్ని పొలాలకు వెళ్లి మరీ కొన్న వ్యవహారం గురించి, ఆక్వా పరిశ్రమ కోసం అస్సోం ప్రభుత్వంతో మాట్లాడటం గురించి… ఏపీ సీఎం – అధికారులు సమిష్టిగా పని చేయని పక్షంలో ఇవన్నీ జరిగేవా? ఇంకెక్కడ అధికారుల అలసత్వానికి చోటుంది? పవన్ కే తెలియాలి!!