మోడీ రాజ‌నీతిని ప్ర‌ద‌ర్శించారు : ప‌వ‌న్ క‌ల్యాణ్

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జనసేన అధినేత‌ పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్ర‌ధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప‌వ‌న్ పేర్కొన్నారు. రైతు చట్టాల ఉపసంహరణ లో ప్రధాని మోడీ రాజ‌నీతి ప్రదర్శించారని కొనియాడారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయ‌య‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు చట్టాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉప‌సంహ‌రిస్తామ‌ని ప్రకటించడం మోడీలోని రాజనీతిజ్ఞతను చాటుతోందని పవన్ ప్రశంసలు కురిపించారు.

అంతేకాకుండా గురునానక్ జయంతి సందర్భంగా మోడీ ప్రసంగం ఆద్యంతం పరిశీలిస్తే శిరోధార్యంగా భావించిన‌ట్టు అర్థమవుతుందని అన్నారు. రైతులు చేసిన పోరాటానికి ఒక ఫలప్రదమైన ముగింపు లభించిందని తెలిపారు. ఇది శుభ పరిణామం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పోరాడితే సాధ్యం కానిది ఏది లేదని రైతుల ఉద్యమంతో నిరూపిత‌మైంద‌ని పవన్ అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుండి కాకుండా సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.