ప‌వ‌న్ పాత పొత్తులు పోయాయ్‌… కొత్త పొత్తులు వ‌చ్చాయ్‌

-

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. నిన్న‌టి వ‌ర‌కు మిత్రులుగా ఉన్న వాళ్లు స‌డెన్‌గా రేపు శ‌త్రువులు అవుతారు. నిన్న‌టి వ‌ర‌కు శ‌త్రువులుగా ఉన్న వారు నేడు మిత్రులు అవుతారు. ఇక్క‌డ కావాల్సింది అధికారం… ప‌ద‌వులు ఎంజాయ్ చేయ‌డం.. పార్టీలు.. నైతిక విలువ‌లు వాళ్ల‌కు ప‌ట్ట‌వు. ఇక ఈ సూత్రం రాజ‌కీయ నాయ‌కుల‌కే కాదు పార్టీల‌కు వ‌ర్తిస్తుంది. నిన్న‌టి వ‌ర‌కు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలే నేడు క‌లిసిపోయి పొత్తులు పెట్టేసుకుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉదాహ‌ర‌ణ‌లు చూశాం. టీఆర్ఎస్‌ను తిట్టిన బాబు చివ‌ర‌కు అదే టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. చివ‌ర‌కు అదే టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఇక బీజేపీ – టీడీపీ ఎన్నిసార్లు క‌ల‌వ‌లేదు.. ఎన్నిసార్లు విడిపోలేదు. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న టీఆర్ఎస్‌, కాంగ్రెస్ కూడా గ‌తంలో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల్లో పోటీ చేసి టీడీపీని ఓడించాయి. త‌ర్వాత అవే పార్టీలు బ‌ద్ధ శ‌త్రువులుగా మారాయి. ఇక ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. ఈ ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన బీఎస్పీ, క‌మ్యూనిస్టు పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయింది.


ఇక ఇప్పుడు ప‌వ‌న్ కొత్త పొత్తుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ పార్టీతో. ఇటీవల పవన్ టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వి.హ‌నుమంత‌రావు క‌లిశారు. న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో యురేనియం త‌వ్వ‌కాల‌పై తాము చేసే పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని హ‌నుమంతరావు ప‌వ‌న్‌ను కోర‌గా ప‌వ‌న్ అందుకు ఓకే చెప్పేశాడు. అంతేకాకుండా హ‌నుమంత‌రావును ఆకాశానికి ఎత్తేశారు. ఆ వెంటనే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యురేనియం తవ్వకాలపై ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్‌ను కూడా ట్యాగ్ చేశారు.

ఇక ఇటు తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంది. అటు ఏపీలో జ‌న‌సేన చిత్త‌య్యింది. అక్క‌డ కాంగ్రెస్ గురించి మాట్లాడే ప‌రిస్థితి లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కొంత వ‌ర‌కు రెండు పార్టీల ఓటింగ్ షేర్ క‌లిస్తే గ‌ట్టి పోటీ ఇవ్వ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లోనే ఈ రెండు పార్టీల నేత‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ కూడా తెలంగాణ‌లో త‌న ఓటు బ్యాంకుకు తోడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా క‌లిస్తే టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవ‌చ్చ‌న్న ప్లాన్‌తో ఉన్నార‌ట‌. ఏదేమైనా ఈ రెండు ప్లాప్ పార్టీల క‌ల‌యిక వ‌ల్ల ఏం ?  జ‌రుగుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news