తెలంగాణకు ‘భీమలా నాయక’.. బీజేపీ బిగ్ స్కెచ్?

-

మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సడెన్ డిసీషన్ తీసుకుంటే ఏడాది ముందుగానే ఎన్నికలు రావొచ్చు. కొద్ది రోజులుగా రాష్ట్రకాంగ్రెస్ నాయకులు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. బీజేపీకి కూడా ఇదే భావనలో ఉంది. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుంటే ‘గవర్నర్ ’ ద్వారా రాజకీయం చేద్దామనుకున్నా అది కోర్టుల్లో నిలిచే అవకాశాలు తక్కువ. కాబట్టి తాను కూడా వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ప్రారంభించారు. ఇక షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. త్వరలో కాంగ్రెస్ నుంచి కూడా పాదయాత్రలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా తన శ్రేణులను సమయాత్తం చేస్తోంది. ఇలాంటి సందర్భంలో ఉరుములేని పిడుగు పడ్డట్టుగా జనసేన కీలక ప్రకటన చేసింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా రాజకీయవర్గాలు ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తరహాలో దాదాపు ఏపీకే జనసేనను, తన రాజకీయాలను పరిమితమైన పవన్ పర్యటన ప్రకటన వెనుక ఏమయి ఉంటుందని ఆరా తీస్తున్నారు.

నిజానికి జనసేన ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తానని నాకు చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. అంతేగాక వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని, పొత్తుల గురించి ఆలోచిస్తామని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోనే పవన్ వెనుక బీజేపీ ఉందనే విషయం సుస్పష్టమవుతోందని వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. నిజానికి ఏపీలో బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం ఏమీ లేదు. కానీ పవన్ వ్యాఖ్యలతో ఆ పార్టీకి కొద్దిగా ఊపు వచ్చినట్లయింది. రెండు పార్టీలు లక్ష్యంగా వైసీపీ విరుచుకుపడుతోంది. దాంతో బీజేపీ కూడా జనం నాలుకలపై నానుతోంది. ఇక..ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఎంతో ముందు ఉంది. ఇక్కడా కూడా పవన్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ‘భీమ్లానాయక్’ చిత్రం విడుదల సందర్భంగా ఈ ఆదరణ కనిపించింది. దానిని ఉపయోగించుకోవాలని భావిస్తోందని టాక్. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పర్యటనను ఖరారు చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేదన్న వాదనలను తిప్పికొట్టే విధంగా జనసేకరణ నుంచి ప్రెస్ మీట్ల వరకు అన్ని రకాలుగా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది. పవన్ కళ్యాణ్ కు యువత పెద్ద ఎత్తున ఆకర్శితులయ్యే అవకాశం ఉండడంతో వారి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా పోరాడుతున్న బీజేపీ.. పవన్ అస్త్రాన్ని కూడా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. తొలుత పవన్ తో పర్యటనలు జరిపించి ఆ తర్వాత ఆయనతో మద్దతు ప్రకటన చేయించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే.. తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే అస్త్రశస్త్రాలను రెడీ చేస్తోందని కూడా అంటున్నారు. ఇప్పటికే బండి సంజయ్, షర్మిళ పాదయాత్రతో హోరెత్తుతున్న తెలంగాణ పవన్ రాకతో మరింత కాకపుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news