గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా లభ్యం అవుతున్న వేళ వాటి నిర్మూలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన పోస్టు పెట్టారు. ఇటీవల ఏపీలోని విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు. గత వైసీప ప్రభుత్వ పాలనలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయిందని పేర్కొన్నారు.
‘రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి మునుపటి అవినీతి, నేర పాలన నుంచి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి. విశాఖ పోర్టులో కొకైన్ షిప్‌మెంట్ సీజ్ చేయడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, ఇదంతా గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని స్పష్టంచేస్తోందన్నారు. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’ అని పవన్ తన ట్వీట్‌లో మెన్షన్ చేశారు.