పురందేశ్వరి టీడీపీ కోసం పనిచేసినా మాకేమీ ఇబ్బందిలేదు : పెద్దిరెడ్డి

-

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

గతంలో కృష్ణలంక కరకట్ట రక్షణ గోడ నిర్మాణానికి ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కానీ సీఎం జగన్ ముందుకు వచ్చారు..నిర్మాణాలు చేపట్టారని ప్రశంసించారు. కరకట్ట నిర్మాణం కోసం కోట్లు కేటాయించి అక్కడి ప్రజల సమస్యని పరిష్కారం చేశారని పెద్దిరెడ్డి చెప్పారు. కష్టపడి పనిచేసే నాయకుడు దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేవినేని అవినాష్ ను ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version