తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఖమ్మంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పువ్వాడ అజయ్‌కుమార్‌కు మెడికల్ ఉన్నది. అయినా కూడా నాతో కొట్లాడి పట్టుపట్టి ఖమ్మానికి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టించిన ఘనత ఆయనకే చెందుతుంది. రవాణాశాఖ మంత్రిగా ఉన్నందుకు అడ్వాంటేజ్ తీసుకున్నడు. హైటెక్ట్ బస్టాండు కట్టిండు. రూ.40కోట్లతో ఆర్టీసీ కల్యాణమండపం కట్టించిండు. ఇవన్నీ పనులు క్రమపద్ధతి ప్రకారం.. కమిట్‌మెంట్‌తో పని చేస్తే ఇలా తయారవుతుంది. బయటకు కూడా ఇలాగే ఖమ్మం పట్టణంలాగే కనీస వసతులు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నయ్’ అన్నారు.
‘మంచినీళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా వారినికి ఒకసారి నీళ్లు వచ్చేది. బిందెలతో యుద్ధాలు జరిగేవి. ఇవాళ 75వేల ట్యాప్ కన్షెన్లు ఖమ్మం ఉన్నయ్. ఒక్క రూపాయికే పేదలకు కనెక్షన్ ఇచ్చేలా పాలసీ తీసుకువచ్చాం. గతంలో కరెంటు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలి. గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్, కన్వర్టర్, స్టెబిలైజర్, కలిగిన వారైతే జనరేటర్ ఉండేవి. ఇవాళ ఇన్వర్టర్ లేదు.. కన్వర్టర్ లేదు.. లో వోల్టేజీ లేదు.. కాలిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు. రూ.300కోట్లతో రఘునాథపాలెం మండలాన్ని అద్భుతంగా చేశారు. రఘునాథపాలెంలో వెతుకుదామంటే ఇవాళ మట్టిరోడ్డు లేదు. ఒకప్పుడు మట్టికొట్టుకుపోయిన రోడ్లే ఉండేవి. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు వేయించి.. కొత్త 20 గ్రామ పంచాయతీలు చేయించి అద్భుతంగా రూరల్ మండలాన్ని తీర్చిదిద్దారు అజయ్‌కుమార్. ప్రభుత్వానికి ఉన్న విజన్.. అజయ్ మిషన్ తోడైతెనే అభివృద్ధి జరిగింది’ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.