చైనాలోని ఓ కౌంటీలో అధికారులు తీసుకొచ్చిన నిబంధనపై అక్కడి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిచువాన్ ప్రావిన్స్ లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించనున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం.. కౌంటీలోని ప్రజలు తమ ఇళ్ళను వంట పాత్రలను శుభ్రం చేయకుంటే.. 1.4 డాలర్లు భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8 డాలర్లు జరిమానా విధించనున్నారు.
కౌంటీలోని ప్రజల జీవన ప్రయాణాలు మెరుగుపరిచేందుకు రూపొందించి కొత్త విధి విధానాల్లో భాగంగా ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. ఇందుకోసం జరిమానా కేటగిరిలను 14 భాగాలుగా విభజించారు. అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతర కీటకాలు, దుమ్ముదూళి ఉంటే మొదటిసారి మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు. రెండోసారి తనిఖీలలో కూడా ఇంట్లో శుభ్రత లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తారని ఎస్సీఎంపీ కథనంలో వెల్లడించింది. ఈ నిబంధనపై కౌంటీ వైస్ డైరెక్టర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం అని తెలిపారు. కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.