ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం.. స్తంభించిన సర్వీసులు

-

ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ట్రైన్ టికెట్ బుకింగ్ సర్వీసులు పూర్తిగా స్తంభించాయి. వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ అప్లికేషన్ సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నవంబర్ 23 ఉదయం నుంచి ఈ సాంకేతిక లోపం ఉన్నట్టు సమాచారం.

ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన అనేక మంది ఐఆర్‌సీటీసీ యూజర్లకు ఇలా మెసేజ్ కనిపిస్తోంది. టికెట్లను బుకింగ్ చేసుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే తమకు ఒక ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోందంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. మెయింటెనెన్స్ కారణంగానే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా మెసేజ్ కనిపిస్తోంది. ఐఆర్‌సీటీసీ https://www.irctc.co.in మాత్రమే కాదు.. మొబైల్ యాప్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది యూజర్లకు కనెక్టివిటీ ఇష్యూ అనే మెసేజ్ వస్తోందని యూజర్లు పోస్టులు పెడుతున్నారు.

అంతేకాదు.. తత్కాల్ ట్రైన్ టికెట్ల కోసం ప్రయత్నించినా కూడా ఇదే సమస్య తలెత్తినట్టు వాపోతున్నారు. ఈ సాంకేతిక సమస్యపై ఐఆర్‌సీటీసీ అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ సాంకేతిక బృందం లోపానికి సంబంధించి పనిచేస్తోందని, అతి త్వరలోనే బుకింగ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news