ఏపీలో రాజకీయం ఎత్తులు పై ఎత్తులతో ఆసక్తిగా నడుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది తిరుగులేని ఘనవిజయంతో తన విజయ పరంపర ప్రారంభించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి వచ్చే నాలుగేళ్ల పాటు ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ నుంచి కనీసం పోటీలేని విజయం సొంతం చేసుకోనున్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు ఏపీలో జరిగే ఏ ఎమ్మెల్సీ ఎన్నిక అయినా, స్థానిక సంస్థల ఎన్నికలు అయినా, రాజ్యసభ ఎన్నికలు అయినా టీడీపీ ఎంత మాత్రం గెలిచే పరిస్థితి లేదు. అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి చూస్తే టీడీపీ ఒక్క విజయం కూడా సొంతం చేసుకునే పరిస్థితి లేదు. మరో విచిత్రం ఏంటంటే ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇప్పటికే పార్టీకి దూరం అయిన సంగతి తెలిసిందే.
ఇక మిగిలిన వారిలో బాలయ్య, చంద్రబాబును పక్కన పెట్టేస్తే ఇంకెంత మంది బాబు వెనక ఉంటారో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్ మరో విజయం తన ఖాతాలో వేసుకోబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్ కు ఎమ్మెల్సీ పదవిని వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి సాంబశివరావు బ్రతికి ఉండగానే ఆయనకు జగన్ ఏదో ఒక పదవి ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు ఆయన మృతితో ఈ పదవిని ఆయన కుమారుడికి ఇస్తున్నారు. ఇక మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి పెన్మత్స సురేష్ ను జగన్ ఎంపిక చేశారు. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేష ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఓడిపోతామని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యను పోటీకి పెట్టిన చంద్రబాబు మరోసారి పరువు పొగొట్టుకోవడం ఎందుకని ఈ సారి తమపార్టీ అభ్యర్థిని పోటీకి కూడా పెట్టడం లేదు.. ఏదేమైనా జగన్ వరుస విజయాల పరంపరలో మరో విజయం ఈ రోజు నమోదు అవుతోంది.