కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. దాని ప్రభావం ఇంకా మరువక ముందే విశాఖవాసులకు మరో పెద్ద కష్టం వచ్చింది. విషవాయువు స్టిరీన్ లీకై జనాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున 3 గంటలకు వాయువు లీక్ అవడంతో.. గాఢనిద్రలో ఉన్న జనాలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు. కొందరు బయటకు పరుగులు తీశారు. ప్రజలకు ఊపిరాడలేదు. అంతలోనే కొందరు శ్వాస తీసుకోవడం ఇబ్బందై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వాయువు ధాటికి 9 మంది వరకు మృతి చెందారు.
అయితే స్టిరీన్ వాయువు లీకైనప్పుడు రోడ్ల మీదకు వచ్చిన జనాలను చాలా వరకు పోలీసులు రక్షించారు. కానీ ఇండ్లలో నిద్రిస్తున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు కొంత సమయం పట్టింది. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌టీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలు ఇండ్లలో ఉన్న వారిని బయటకు తీసుకువచ్చారు. వాయువు లీకైన ప్రదేశం నుంచి చుట్టు పక్కల ఉన్న అనేక ప్రాంతాల్లో సుమారుగా 10వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో 2వేల మంది వరకు ఇండ్లలోనే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయా దళాలు వారిని కష్టపడి బయటకు తీసుకువచ్చాయి.
ఇక వాయువు ధాటికి తీవ్ర అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించేందుకు హాస్పిటళ్లకు తరలించారు. ఈ క్రమంలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే సమయం గడుస్తున్నకొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ వాయువు వల్ల ఎంతో మందికి ఇప్పుడు ప్రాణాపాయం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి బాధితులకు హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నా.. సమయం గడిస్తేనే గానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ బాధితులకు ఏమీ కాకూడదని ఇప్పుడు అందరూ భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.
కరోనా మహమ్మారి తెచ్చిన కష్టం నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయట పడుతున్నామని అనుకుంటున్న తరుణంలో.. ఈ సంఘటన విశాఖవాసులను కలవరపెడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంత మంది ఈ వాయువు ధాటికి విషమ పరిస్థితిలో ఉన్నారు, ఎంత మంది చనిపోతారోనని జనాలు భయపడుతున్నారు. చికిత్స పొందుతున్న వారు క్షేమంగా తిరిగి రావాలని.. విశాఖపట్టణం.. వి’శోక’పట్టణంగా మారకూడదని.. అందరూ ప్రార్థిస్తున్నారు..!