డ్రగ్స్ తయారీకి సంబంధించి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన 45 ఏళ్ల శ్రీనివాస రావు దారి తప్పాడు. తన చదువును అక్రమ సంపాదన కోసం ఎంచుకుని అరెస్ట్ అయి ఊచలు లెక్క పెడుతున్నాడు. హైదరాబాద్‌లో శివార్లలో ఓ ఇంటిని అద్దెకి తీసుకుని మెపిడ్రిన్ మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తున్నాడు. నిన్న ఈ డ్రగ్స్ అడ్డాపై దాడి చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ – DRI అధికారులు… 3 కేజీల మెపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 63 లక్షల రూపాయల పైనే ఉంటుందని అంటున్నారు అధికారులు.
అలాగే, 250 కేజీల ముడి పదార్థాలను అక్కడి నుండి సీజ్ చేశారు. ఈ ముడిపదార్థాల సాయంతో 15 నుంచి 20 కేజీల మెపిడ్రిన్ చేయవచ్చని తేల్చారు అధికారులు. శ్రీనివాసరావు తయారు చేసిన డ్రగ్స్‌ను ముంబైకి చెందిన ముఠాకు అమ్ముతున్నాడు. ఈ ఏడాది కాలంలో అతను వంద కేజీలకు పైగా మెపిడ్రిన్ డ్రగ్‌ను తయారు చేసి, సరఫరా చేసినట్టు నిర్ధారించారు అధికారులు. శ్రీనివాస రావు గతంలో ఓ ఫార్మా సెక్టార్లో పని చేశాడు. అక్కడ డబ్బు చాలకపోవడంతో ఏకంగా మాదక ద్రవ్యాల తయారీకి తెరలేపాడు. చిన్న క్లూ ఆధారంగా హైదరాబాద్‌లో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో రైడ్‌లు చేయడంతో ఈ శ్రీనివాస రావు బాగోతం బయటపడింది.