ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో .. కెసిఆర్ సర్కార్ కు షాక్ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు అయింది. ఉదండాపూర్ రిజర్వాయర్ కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట (బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని పిటిషన్ లో ఆరోపణలు చేశారు. ముదిరెడ్డి పల్లికి చెందిన కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించడంలేదని పేర్కొన్నారు పిటిషనర్. అయితే ఈ కేసును ఊహించని విధంగా ఎన్జీటీ స్వీకరించింది. ఇందులో భాగంగా కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది ఎన్జీటీ.
అంతేకాదు పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగాయేలేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. పర్యావరణ ఉల్లంఘనల పై వాస్తవ పరిస్థితిని తనిఖీలు జరిపి 27-08-2021 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ. ఇక ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 27 వ తేదీకి వాయిదా వేసింది.