రష్యా దేశం తమ స్పుత్‌నిక్-వి కరోనా వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి తమకు అందివ్వాలని భారత్‌ను సహాయం కోరింది. ఇప్పటికే ఆ వ్యాక్సిన్‌ను రష్యా అక్కడ మొదటి బ్యాచ్‌లో సిద్ధం చేసి ప్రజలకు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే వ్యాక్సిన్ డోసుల కోసం భారత్‌పై రష్యా ఆధార పడుతోంది. భారత్‌లోని ఫార్మా కంపెనీల్లో తమ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి అందించాలని రష్యా కోరింది. ఈ విషయాన్ని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ధ్రువీకరించారు.
కాగా స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్ ఉత్పత్తితోపాటు భారత్‌లో ఈ వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహించేందుకు కూడా అనుమతులు ఇవ్వాలని రష్యా కోరిందని డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే ఇందుకు భారత్ కూడా సుముఖంగా ఉందని ఆయన వివరించారు. కాగా ఆగస్టు 11న రష్యా తమ స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేయగా.. మొదట్లో చాలా దేశాలు ఈ వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే తొలి రెండు దశల ట్రయల్స్ డేటా వివరాలను రష్యా బయట పెడుతుండడంతో ఈ వ్యాక్సిన్ సేఫే అని తెలుస్తోంది.
భారత్ నిజానికి ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. అందుకనే రష్యానే కాదు, బ్రిటన్, అమెరికాలు కూడా తమ వద్ద తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లను భారత్‌లోని ఫార్మా కంపెనీల్లో ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలను కూడా కుదర్చుకున్నాయి. ఇక మన దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే సరికి ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నాయి.