ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిన్న విశాఖ గర్జన తరువాత ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్న వైసీపీ మంత్రులపై జనసైనికులు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే.. తాజాగా విశాఖ విమానాశ్రయంలో నిన్న జరిగిన ఘటనలపై మంత్రి రోజా సహాయకుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి రోజాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ దాడిలో తాను గాయపడ్డానని దిలీప్ వెల్లడించారు. ఓ లోహపు మూత తగిలి తన తలకు గాయమైందని తెలిపారు.
ఈ దాడిలో 300 మంది జనసేన కార్యకర్తలు దాడికి దిగారని వివరించారు. ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారని దిలీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దిలీప్ ఫిర్యాదును స్వీకరించిన విశాఖ ఎయిర్ పోర్టు పోలీసులు జనసేన నేతలపై చర్యలకు ఉపక్రమించారు. 28 మంది జనసేన నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే పితాని సత్యనారాయణ, పంతం నానాజీ తదితర అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.