న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎక్కడా విన్న న్యూ ఇయర్ పార్టీల ఏర్పాటుకు సంబంధించిన విషయాలే వింటున్నాం. అయితే ప్రతీ సంవత్సరం న్యూఇయర్ వస్తోంది, వెళ్తోంది. ఈ సమయంలో హ్యాపీగా వేడుకలు జరుపుకుంటే పర్లేదుగానీ… ఆ వేడుకల పేరుతో నానా రచ్చ చేయడం, గొడవలకు దిగడం, అమ్మాయిలను ఏడిపించడం ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. ఈసారి బాణసంచా కాల్చినా, బార్లు పబ్బుల్లో అశ్లీల వేషాలు వేసినా, అసభ్యంగా తయారైనా, తాగి వాహనాలు నడిపినా దొరికితే రూ.10000 ఫైన్ వేస్తామంటున్నారు పోలీసులు.
అలాగే డిసెంబర్ 31న తాగి దొరికితే ఏకంగా 10వేల ఫైన్ వేస్తామన్నారు. వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. హైదరాబాద్ పరిధిలో పలు నిబంధనలు రూపొందించారు. వీటితో పాటు.. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా వస్తువులు కనపడినా వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం. 949-061-7111 సైబరాబాద్ వాట్సాప్ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నం. 850-041-1111 కు సమాచారం ఇవ్వాలి. నూతన సంవత్సర వేడుకుల ను రాత్రి 8 నుంచి 1 గంట వరకే నిర్వహించాలి.
వేడుకల నిర్వాహకులు 10 రోజుల ముందే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. వేడుకలు జరిగే చోట ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు మస్ట్. ట్రాఫిక్ సమస్య రాకుండా సెక్యూరిటీ గార్డుల్ని పెట్టుకోవాలి. డీజేకు అనుమతి లేదు 45 డెసిబెల్స్ మ్యూజిక్ శబ్దం మించకూడదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా వాహనం సీజ్. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. వేడుకల్లో అశ్లీలం ఉండకూడదు. వేడుకల్లో ఆయుధాలు నిషేధం. క్యాబ్ ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్ 100 లేదా హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.