`ఆటిజం`తో ఆట‌లు.. హైద‌రాబాద్ న‌కిలీ థెర‌పీ సెంటర్ల‌పై పోలీసుల దాడులు

-

ఆటిజం.. ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన మాన‌సిక రుగ్మ‌త‌. చిన్నారుల్లో పుట్టుక‌తోనే వ‌చ్చే స‌మ‌స్య‌. అయితే.. ఇది అంద‌రికీ రాదు. 1000 మందిలో ఒక‌రిద్ద‌రికి మాత్రమే సంభ‌వించే స‌మ‌స్య‌. అయితే.. దీనికి ప్ర‌స్తుతానికి నేరుగా ఔష‌ధాలు ఏమీలేవు. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆటిజం స‌మ‌స్య ఉంది. దీనిని అరిక‌ట్టేందుకు ఇంకా ప్ర‌యోగాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక‌, ప్ర‌స్తుతం ఈ రుగ్మ‌త‌ను త‌గ్గించి.. మాన‌సిక స్థితిని కోల్పోయిన చిన్నారుల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలోకి తెచ్చేందుకు కేవ‌లం థెర‌పీ (నైపుణ్యంతో కూడిన చికిత్స‌.. దీనిలో ఎన్నోవిధానాలు ఉన్నాయి) మాత్ర‌మే అందుబాటులో ఉంది.

ఇది కూడా రిజిస్ట‌ర్ అయిన సంస్థ‌లు మాత్ర‌మే థెర‌పీ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఆటిజంతోనూ డ‌బ్బులు సంపాయించుకోవాల‌నే కొంద‌రు విచ్చ‌ల‌విడిగా ఎలాంటి అనుమ‌తులు లేకుండానే థెర‌పీ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అక్క‌డ తెలిసో తెలియ‌కో త‌మ పిల్ల‌ల‌ను చేర్పిస్తున్న త‌ల్లిదండ్రుల జేబులు గుల్ల‌వుతున్నాయే త‌ప్ప‌.. చిన్నారుల్లో మాత్రం ఎలాంటి మార్పుక‌నిపించ‌డం లేదు. దీంతో ప‌లువురు త‌ల్లిదండ్రులు ఇచ్చిన ర‌హ‌స్య ఫిర్యాదుల‌తో హైద‌రాబాద్‌లో అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న థెర‌పీ కేంద్రాల‌పై పోలీసులు దాడులు చేశారు.

హైదరాబాద్ మహానగరంలోని కూక‌ట్ప‌ల్లి, సుచిత్ర‌, బీకే గూడ‌, దిల్‌షుక్ న‌గ‌ర్ ప్రాంతాల్లో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న `ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్`, `రిహాబిలిటేషన్ సెంటర్ల`పై గత రెండు మూడు రోజులుగా పోలీసులు, వైద్య బృందాల సాయంతో దాడులు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేకుండానే, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తులు లేకుండా నిర్వ‌హిస్తున్న కేంద్రాల నిర్వాహ‌కుల‌ను కూడా అరెస్టు చేసిన‌ట్టు తెలిసింది. ఆయా కేంద్రాల్లోని సిబ్బందిని ప్ర‌శ్నిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎలాంటి అనుమ‌తులు ఉండాలంటే..!

చిన్న పిల్లలలో సెన్సోరియల్(గుర్తింపు, జ్ఞాప‌క శ‌క్తి) సమస్యలు, ఎదుగుదల లోపాలు, మానసిక రుగ్మతలకు సంబంధించిన ఇబ్బందులను ఆటిజం అంటారు. ఈ స‌మ‌స్య‌కు శాస్త్రీయ పద్దతిలో మాత్రమే థెరపీ ఇవాల్సిఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగుల హ‌క్కుల( RPWD) చ‌ట్టం 2016లోని సెక్ష‌న్ 52 ప్ర‌కారం ఈ థెర‌పీ కేంద్రాల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకుని నిర్వ‌హించాలి. అదేవిధంగా నిపుణులైన వారిని మాత్రం దీనిలో నియ‌మించాలి. వారికి మాన‌సిక ప‌రిజ్ఞానం, చిన్నారుల‌ను అక్కున చేర్చుకునే ల‌క్ష‌ణం వంటివి ఉండాలి.

అక్ర‌మ కేంద్రాల వెనుక‌..

కానీ, డ‌బ్బు కోసం అడ్డ‌దారులు తొక్కేందుకు అల‌వాటు ప‌డిన కొంద‌రు వ్య‌క్తులు ఆటిజంను న‌యం చేస్తామంటూ.. బోర్డులు పెట్టుకుని ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌లను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో భాగ్య‌న‌గ‌రం వీరికి అందివ‌చ్చిన అవ‌కాశంగా మారుతోంది. ఆటిజంపైనా, థెర‌పీపైనా స‌రైన అవగాహన లేకుండా `థెరపిస్` పేరుతో చిన్నపిల్లల భవిష్యత్తుపై తీవ్ర‌మైన ప్రభావం చూపిస్తున్నారు. తాజాగా జ‌రిగిన దాడుల‌పై త‌ల్లిదండ్రులు స్పందిస్తూ.. న‌కిలీ కేంద్రాలు..అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news