పోలీసులు అంటే.. పౌరులకు రక్షణ కల్పించడం, భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులను అద్దెకు తీసుకోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? కేవలం పోలీసులనే కాదు.., పోలీస్ స్టేషన్‌ను, పోలీసు జాగీలను కూడా అద్దె తీసుకోవచ్చట. ఇంతకీ ఈ కాన్సప్ట్ ఎక్కడ ఉందో చూద్దాం.
ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతుంటాయి. అలాంటిదే ఇది కూడా. కాకపోతే, ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజుకు రూ.34 వేలతో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ని మీకు గార్డుగా పెట్టుకోవచ్చు. మీకు ట్రైనింగ్ పొందిన పోలీస్ డాగ్‌ని కూడా ఇస్తారు. అంతేకాదు.. పోలీస్ దగ్గర వైర్‌లెస్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంటుంది. మీకు ఓ పోలీస్ స్టేషన్‌ని కూడా వాడుకునే హక్కు ఉంటుందట. ఏంటిది పోలీస్ స్టేషనా డ్రామా కంపెనీఆ అనుకుంటున్నారా..?
ధరలు ఎలా ఉంటాయంటే..
కేరళ ప్రభుత్వం ఈ స్కీమ్ తెచ్చింది. నిజానికి ఇది పాత స్కీమే. దీని ధరలను పెంచుతూ.. మళ్లీ తెరపైకి తెచ్చిందట. ఆర్థిక సమస్యల్ని అధిగమించేందుకు పోలీస్ శాఖ ఈ ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ తాజా జీవో ప్రకారం ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ అద్దెకు కావాలంటే ఒక రోజుకు రూ.3,035 నుంచి రూ.3,340 అవుతుంది. అంత కాస్ట్ భరించలేం అనుకుంటే కానిస్టేబుల్ (సివిల్ పోలీస్ ఆఫీసర్)ని అద్దెకు తీసుకోవచ్చు, అందుకు రోజుకు రూ.610 ఇవ్వాలి. పోలీస్ డాగ్స్ కావాలంటే రోజుకు రూ.7,280 చెల్లించాలి. వైర్‌లెస్ ఎక్విప్‌మెంట్ అద్దెకు కావాలంటే ఒక రోజుకు రూ.12,130 ఇచ్చుకోవాలి. ఇవన్నీ కాదు.. డైరెక్టుగా పోలీస్ స్టేషనే అద్దెకు కావాలంటే రోజుకు రూ.12,000 చెల్లించాలి.
ఎవరు అద్దెకు తీసుకుంటారు..?
పోలీసుల కంటే, పోలీస్ కుక్కలకే కాస్ట్ ఎక్కువ ఉంది. అలాగే ఎక్విప్‌మెంట్‌కి ఎందుకంత అద్దె అనే ప్రశ్న రావచ్చు. వీటికి ప్రభుత్వం తన జీవోలో ఆన్సర్ ఇవ్వలేదు. అసలు ఎవరు అద్దెకు తీసుకుంటారంటే..ప్రైవేట్ పార్టీలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఫిల్మ్ షూటింగ్స్ వంటి వాటికి అద్దెకు తీసుకోవచ్చట.
వెల్లువెత్తుతున్న విమర్శలు..
దీనిపై ప్రజలే కాదు పోలీసుల్లోనూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని తగ్గిస్తుంది అంటున్నారు. అంతేకాదు ఎక్విప్‌మెంట్ గురించి అందరికీ తెలిస్తే, తమకు సెక్యూరిటీ సమస్యలు వస్తాయి అంటున్నారు. గతేడాది కన్నూరులో ఓ వ్యాపారవేత్త పెళ్లికి నలుగురు పోలీసులు గార్డులుగా వ్యవహరించారు. అది వివాదం అయ్యింది. మొత్తంగా ఇలాంటి నిర్ణయాలు, పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న గౌరవ భావాన్ని దెబ్బతియ్యకుండా ఉండాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం కచ్చితమైన నియమ నిబంధనలు రూపొందించాలని కోరుతున్నారు.