రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఛాన్స్ చిక్కినా నాయకులు వాడుకోవడం సహజమే. ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా లభించిందనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు అనూహ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కోర్టుల నుంచి మొట్టికాయలు.. మరోవైపు.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న పనులను హైకోర్టు నిశితంగా ప్రశ్నిస్తోంది. ఇక, కరోనా కేసులను ఎదుర్కొనడంలోనూ కేసీఆర్ ఫెయిలయ్యారనే వాదన కూడా స్పష్టంగా వినిపిస్తోంది.
ఇటీవల పీవీ 99వ జయంతిని పురస్కరించుకుని కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. నిజానికి తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది జయంతులు జరిగినా దేనికీ ప్రాధాన్యం ఇవ్వని కేసీఆర్ ఈ ఏడాది మాత్రం కార్యక్రమాలు నిర్వహించారు. అదేసమయంలో శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీవీ నరసింహారావును రాజకీయం చేయడం! ఆశ్చర్యంగా అనిపించినా.. తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం జోరుగా హల్ చల్ చేస్తోంది.
వాస్తవానికి పీవీ కాంగ్రెస్ నాయకుడు. కానీ, ఈయనను ఆ పార్టీ వదిలేసింది. దీంతో బీజేపీ పీవీని తగిలించుకుంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పీవీని మోసేస్తున్నారు. దీంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడిపోయింది. ఇక, ఇదే పంథాలో ఇప్పుడు కేసీఆర్ కూడాప్రయాణం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు ముకుతాడు వేసేందుకు ఆయన శతజయంతిని ఎంచుకున్నారనే వాదన ఉంది. ఇక, ఇప్పుడు తాజాగా పీవీ కుమార్తె సురభి వాణీదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీ కాలమూ పూర్తవుతోంది.
ఈ మూడు స్థానాలూ గవర్నర్ కోటాలోవే. నాయిని, కర్నె ప్రభాకర్‌లను రెన్యువల్ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. మూడో సీటుకు పార్టీలో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా పీవీ కుమార్తెను పార్టీ అధిష్ఠానం తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా, పీవీ సెంటిమెంటుతో కాంగ్రె్‌సను దెబ్బకొట్టి.. ఆ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు టీఆర్‌ఎస్ వేసిన ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రె్‌సను భుజానికెత్తుకుని ఆదుకున్న పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబీకుల్లో ఉంది. దీంతో ఈ సెంటిమెంటును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.