పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం నిరసనల్లో దారుణం జరిగింది. ముర్షిదాబాద్‌లో బుధవారం జరిగిన సిఎఎ వ్యతిరేక నిరసనల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కాల్పులు జరపగా ఇద్దరు నిరసన కారులు ప్రాణాలు కోల్పోయారు. టిఎంసి పార్టీ లంగి బ్లాక్ ప్రెసిడెంట్ తాహిరుద్దీన్ నిరసనకారులపై కాల్పులు జరిపగా ఇద్దరు మరణించడంతో పాటుగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించారు. మక్బూల్ షేక్, అనిరుధ్ బిస్వాస్ గా గుర్తించారు. కొంత కాలంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. దీనితో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. దీనిపై మక్బూల్ షేక్ కుమారుడు స్పందించారు. తన తండ్రి ప్రతీ రోజు మసీద్ లో నమాజ్ చదువుతారని, తర్వాత మసీద్ కి తాళం వేసి తిరిగి వస్తారని చెప్పుకోచ్చాడు.
అదే విధంగా ఈ రోజు కూడా జరిగిందని అయితే ఈ రోజు, CAA-NRC కి నిరసనగా ఒక సమ్మెకి పిలుపునిచ్చారని, తన తండ్రి తిరిగి వస్తున్నప్పుడు కొన్ని మారుతీ వ్యాన్లు వచ్చాయని, అప్పుడు తాహీరుద్దిని తుపాకీతో ఉన్నట్టుండి కాల్పులు జరిపారని, కాని పోలీసులు గాని ఎవరూ అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇక బిస్వాస్ సోదరుడు మాట్లాడుతూ… తాము చాలా పేద వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేసాడు.
తమకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధాలు లేవని పేర్కొన్నాడు. అయితే ఈ ఘటన వెనుక ఏమైనా రాజకీయ ఉద్దేశం ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఈ ఘటనకు పార్టీకి ఏమీ సంబంధం లేదని స్థానిక ఎంపీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసారు.